fbpx

AP News Online

జర్నలిజం కలుషితమైన మీడియం అయిపోయిందా?

ఈ ప్రపంచంలో బొత్తిగా నీతి నిజాయితీ లేకుండా పోతున్నాయి.. మంచి చెడూ అస్సలే ఉండట్లేదు.. ఎవ్వరూ డబ్బులు ఇస్తే వాళ్ల డబ్బా కొట్టడమేనా.. ఎవ్వరూ యాడ్స్ ఇస్తే వారికి గులాం కావాల్సిందేనా..? అసలు ఎటు పోతుంది ఈ మీడియా వ్యవస్థ.. స్వాతంత్ర్యం రావడానికి ప్రధాన కారణం.. పత్రికల ద్వారా గాంధీ లాంటి మహాత్ములు ప్రజలకు అవగాహన కల్పించడమే.. ఆ నాడు పత్రికల్లో చూసిన పోరాటాలనే ప్రజలు అన్వయించుకొని స్వాతంత్ర్యం సంపాదించుకున్నారు. ప్రజల్ని మేల్కొలిపేది ఖచ్చితంగా మీడియా వ్యవస్థనే.. సమాజంలోని కుళ్లు ను ఎత్తిచూపేది మీడియానే.. అన్యాయం, ఆక్రందన, ఘోరం.. ఏదైనా మీడియా పంచన చేరితే న్యాయం పక్కా అని నమ్మే రోజులవీ.. 40 ఏళ్ల క్రితం వరకు మీడియా ఇంతలా కలుషితం కాలేదు.. కానీ ఇప్పుడు అయ్యింది… కులం, మతం, డబ్బు ఇలా అన్నీ మీడియాను ఏకపక్షం చేస్తున్నాయి. కొనేస్తున్నారు.. అందరినీ పప్పూ బెల్లాల్లా కొనేస్తున్నారు. తమకూ ఎదురే ఉండకూడదన్న స్వార్థంతో పక్కవారిని అణిచేస్తున్నారు.. వారి మాటే జనం వాక్కుగా భ్రమలు కల్పించి జనాన్ని ఆగమాగం చేస్తున్నారు. ఇందులో మంచి వారు, నిజాయితీ పరులు నవ్వులపాలు అవుతుండగా.. అక్రమార్కులు పెద్దమనుషులుగా చెలామణీ అవుతున్నారు..

మీడియా వక్రబుద్ధి..

ఒక పెద్దాయన ఎంతో సదుద్ధేశంతో నిజాలు నిర్భయంగా చెబుతామని.. నాలుగు దశాబ్దాల క్రితం ‘ఉదయం’ అనే పత్రికను స్థాపించారు.. కానీ అది కొన్నాళ్లకే మూతపడింది. ఒక జిత్తులమారి తనకు పోటీగా వచ్చిన పత్రిక చూసి కుళ్లుకున్నారు. అందుకే రాజకీయ అండదండలతో ఆ పత్రిక ఆర్థిక మూలాలు దెబ్బతీసి మూతపడేలా చేశారు. ఆ తర్వాత తనకు పోటీగా 1996లో వచ్చిన ఇంకొక వార్త పత్రికను అదే రీతిలో చేసి ఇప్పుడు మార్కెట్లోనే కనపడకుండా చేశారు. ప్రజలకు నిజాలు చెబుతారనే ఇలా యాంటీగా వచ్చిన పత్రికలు, చానాళ్లును మూతపడేవిదంగా చేస్తూనే వున్నారు. మీడియాలో ఎప్పుడైతే పెత్తందార్లు, కులాభిమానులు, రాజకీయ నాయకులు వచ్చి చేరారో అప్పుడే అది భ్రష్టు పట్టిపోయింది.. ఇప్పటికీ అదే పంథా కొనసాగుతోంది.. ఎన్టీఆర్ హయాం నుంచి కొమ్ముకాస్తూ వచ్చిన పత్రిక అనంతరం ఆయన్ను పదవీచిత్యున్ని చేసి చంద్రబాబుకు పట్టం కట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కొమ్ము కాస్తూనే ఉంది. సీఎంలనే మార్చే స్థోమత ఉందంటే మీడియా పవర్ ను అర్థం చేసుకోవచ్చు.. ఇది తెలుసు కనుకే ప్రచారంలో పోటీ ఇవ్వడం లేదని.. గద్దెనెక్కగానే మాజీ సీఎం దివంగత రాజశేఖర రెడ్డి సాక్షి పత్రికను స్థాపించారు. ఇది ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది.. ఇప్పటికీ తెలుగు మీడియాలో కొన్ని చానాళ్లు టీడీపీకి, కొన్ని కాంగ్రెస్ కు.. కొన్ని వైసీపీకి మద్దతుగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..

బురదజల్లడంలో ఆ చానాళ్లే ఫస్టు..

పాపం.. రాజకీయాలు ఇలా ఉంటాయని చిరంజీవికి తెలియదు.. తాను దిగేది బురదగుంటలో అనేది ఆయనకు తెలియదు. అందుకే దెబ్బై పోయాడు.. ప్రజారాజ్యం స్థాపించిన మొదలు చిరును దెబ్బకొట్టే ప్రయత్నాలు వేగంగా సాగాయి. ఆయన అనుయాయుల్ని ప్రలోభపెట్టి ఆయన ఆఫీసులోనే తిట్టించి అభాసుపాలు చేశారు. ఒక వర్గం మీడియా చిరుపై ఉన్నవి లేనివి.. అసమర్థుడు అంటూ ప్రచారం చేసి చివరకు సీఎం అవ్వాల్సిన వ్యక్తిని ఇలా ఆయన సొంత ఊరిలోనే డిపాజిట్లు కూడా దక్కకుండా చేశారు…. ఇదంతా డబ్బులకు అమ్ముడుపోయిన.. కుల అహంకారంతో చేస్తున్న కొన్ని చానాళ్లు, పత్రికల కుట్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈనాడు పత్రిక అయితే చంద్రబాబు ప్రోద్బలంతో ఏకంగా చిరు ‘జెండా పీకేస్తున్నాడు’ అంటూ ప్రధాన కథనం ప్రచురించి ఆయన్ను ఆయోమయం చేసింది. ఇలా ఒక్కటేమిటీ.. నాడు వైఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఆయన మీద వరుసగా రాజకీయ కథనాలే నడిపాయి.. కానీ ఆయన రెండోసారి గెలిచారు.. ఇక చంద్రబాబు ఓటుకు నోటు కేసులో బుక్కయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు అనూకూల మీడియా అసలు అది వార్తే కాదన్నట్టు ప్రసారం చేయలేదు.. ప్రచురించలేదు.. చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే హైకోర్టుకు వెళ్లిన కేసులో ఆయన ప్రమేయంపై వాదించినా వార్త కాలేదు.. ఆఖరకు చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తును కూడా ఒక వర్గం మీడియా తొక్కేసింది.. అదే వైఎస్ కానీ.. చిరు కానీ, ఇతర కాంగ్రెస్ నేతలపై అలా జరిగిఉంటే వారిని బట్టలు విప్పి ప్రజల ముందు నిలబెట్టేవేమో.. అంతలా రాక్షసత్వం ప్రదర్శించాయనడంలో సందేహం లేదు.. ఇప్పటికీ జగన్ ఎండన పడి పాదయాత్రలు చేసినా ఆయనపై కనీసం వార్త రాయరు.. చంద్రబాబు మనవడు ఏడ్చినా గంటలకొద్దీ దానిమీద న్యూస్ లు ఇస్తారు. ఉద్దానం బాధితులపై పవన్ గొంతుచించుకున్నా కూడా ఈ వర్గం మీడియా పట్టించుకోదు.. చంద్రబాబు పారిన్ టూర్ కెళ్తే అక్కడిపోయి కవరేజ్ ఇస్తారు.. సాక్షి మీడియా సైతం చంద్రబాబు భూదందా చేశాడని.. అమరావతిలో భూములు కొల్లగొట్టాడని ఎంత ప్రచారం చేసినా మీడియా మేనేజ్ మెంట్ లో ఆరితేరిన బాబు సాక్షిపై కేసులు వేయించి తొక్కేశాడు..

ఇక కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ ను ముప్పుతిప్పలు పెట్టింది ఈ మీడియానే.. ఆయన అధికారంలోకి రాకుండా పచ్చమీడియా ఎన్నో చేసింది. ఆయన వచ్చాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ ఎమ్మెల్యేలు వెర్రివాళ్లు అని ప్రసారం చేసిన కథనాలు దుమారం రేపాయి. సీఎం కేసీఆర్ సభసాక్షిగా వాటిని ఎండగట్టి టీవీ9, ఆంధ్రజ్యోతి చానాళ్లను ఏకంగా తెలంగాణలోనే అనధికారికంగా నిషేధించారు.. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు.. ఎన్నో సాక్ష్యాలు.. మొత్తంగా తెలుగు మీడియా భ్రష్టుపట్టింది. విలువలు మాని కొందరి పక్కన చేరింది..

మీడియా దాహం తీరలేదు..

చిరంజీవి తన 150వ సినిమా ఆడియో రిలీజ్ హక్కుల్ని ఒక ప్రముఖ టీవీకు కట్టబెట్టినా కూడా ఆ టీవీ యాజమాన్యానికి దాహం తీరలేదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా శాతకర్ణి సూపర్.. ఖైదీ ఓకె అంటూ ప్రచారం చేసుకుంటోంది.. తన కథనాల్లో బాలయ్య సినిమాను ఆకాశానికెత్తేస్తోంది. రిలీజ్ అయినప్పటినుంచి అస్సలు చిరు సినిమా గురించే తీయడం లేదంటే అతిశయోక్తి కాదు.. మిగతా కొన్ని చానాళ్లు ప్రత్యేకంగా బాలక్రిష్ణ సినిమా ఘనవిజయం అంటూ పెద్ద లాబీయింగే నడుపుతున్నాయి. చిరంజీవి సినిమా జనంలో ప్రేక్షకుల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్నా అవేమీ చూపించట్లేదు.. ఆనాడు రాజకీయంగా దెబ్బకొట్టిన వారే నేడు బాలయ్య కోసం.. అధికార పార్టీ అండదండల కోసం ఇలా జర్నలిజం విలువలను పక్కనబెట్టిశారు. ఈ కుతంత్రంలో ఘనవిజయం సాధించిన ఖైదీ నంబర్ 150 సమిధ అవుతోంది.. నిరాశపరిచిన శాతకర్ణి మూవీని సూపర్ హిట్ అని ఊదరగొడుతున్నారు..

గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల కాకముందే ఓ చానల్ ఆ సినిమా ప్లాప్ అని ఉదయం 8.45కే వేయడం అప్పట్లో దుమారం రేగింది.. మీడియా ఇలా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం.. దెబ్బ తీయడం ఇలా తరుచుగా జరుగుతూనే ఉంటోంది.. ఇప్పటికైనా మీడియా మారాలి. ప్రజా హితం కోసం పనిచేయాలి.. మంచిని మంచిగా చెప్పాలి.. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది.. ప్రజాసమస్యలు వెలుగులోకి వస్తాయి. నిజామైన నాయకులకు, పౌరులకు గుర్తింపు లభిస్తుంది..

To Top

Send this to a friend